తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో కొత్త మార్పులు చేపడుతోంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో కొత్త మార్పులు చేపడుతోంది. ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలోను, మరోవైపు కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచడంలో భాగంగా, తాజాగా కొన్ని నాన్ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సుల సీటింగ్ ఏర్పాట్లలో మార్పులు తీసుకొచ్చింది.
ఈ కొత్త సీటింగ్ పద్ధతి మెట్రో రైళ్ల తరహాలో ఉండేలా రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణ పథకం ద్వారా మహిళా ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో బస్సులు పూర్తిగా రద్దీగా నడుస్తున్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులకు సీట్లు అందించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు తాజా నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా, గతంలో మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేందుకు బస్సుల్లో అమర్చిన గ్రిల్స్‌ను తొలగించి, కొత్త సీట్లు ఏర్పాటు చేశారు. ఈ మార్పులు పల్లె వెలుగు లేదా డీలక్స్ ఎక్స్‌ప్రెస్ వంటి తక్కువగా ప్రయాణించే బస్సుల్లో ప్రారంభించారు. హైదరాబాద్ రీజియన్‌లో మెట్రో రైళ్ల తరహాలో సీటింగ్ ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
“మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య రోజు 11 లక్షల నుంచి 18 20 లక్షల వరకు పెరిగింది,” అని అధికారులు తెలిపారు.
ఉదయం, సాయంత్రం సమయాల్లో కార్యాలయాలు, కళాశాలలకు వెళ్లే వారితో బస్సులు ఎక్కువగా రద్దీగా ఉంటాయి.
ఈ కొత్త సీటింగ్ పద్ధతి వల్ల బస్సు మధ్య భాగంలో ఎక్కువ ఖాళీ వస్తుంది. ఒకే బస్సులో మరింత మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రద్దీ రూట్లలో ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే మిగతా రూట్లలో కూడా ఈ సీటింగ్ విధానాన్ని అమలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.