కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ, తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 28 నవోదయ, 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి. ఈ విద్యా సంస్థల ద్వారా నూతనంగా 6,700 ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని కేంద్రం అంచనా.
ఇందులో కేవీల్లో 5,388 ఖాళీలు, నవోదయాల్లో 1,316 పోస్టులు అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. రూ.5,872 కోట్ల రూపాయలతో 8 ఏళ్ల కాలంలో స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.